ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా (e-VITARA)ను ప్రారంభించారు. ఇది పూర్తిగా భారత్‌లో తయారైన మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తి ప్లాంట్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ లక్ష్యాలను చేరుకోవడంలో ఇది ఒక కీలక ముందడుగని ప్రధాని పేర్కొన్నారు.
భారత్‌లో తయారైన ఇ-విటారాను 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని మారుతి సుజుకీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కారు 2025 జనవరిలో ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. దేశీయ మార్కెట్‌తో పాటు జపాన్, యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ కారుతో భారత్ గ్లోబల్ ఈవీ ఉత్పత్తి కేంద్రంగా ఎదగడం ఖాయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈవీ ఉత్పత్తిలో భాగంగా హన్సల్‌పూర్ ప్లాంట్‌లో 80 శాతం హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్‌ను దేశీయంగా ఉత్పత్తి చేస్తారు. డెన్సో, తోషిబా, సుజుకీల భాగస్వామ్యంతో ఏర్పడిన TDS లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఈ బాధ్యతను చేపడుతోంది. దీని వలన భారత్ విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుని, స్వదేశీ ఉత్పత్తిని పెంచుకోవచ్చు.
ఇ-విటారా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 49kWh బ్యాటరీతో ఉన్న మోడల్ 144 hp శక్తిని, 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61kWh బ్యాటరీతో ఉన్న పెద్ద మోడల్ 174 bhp శక్తిని ఉత్పత్తి చేస్తూ 500 కి.మీ. పైగా రేంజ్ ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 2,100 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం 100 నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు స్మార్ట్ హోమ్ ఛార్జర్లు, ఇన్‌స్టాలేషన్ సపోర్ట్ కూడా అందించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో భారత్ అధికారికంగా సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల గ్లోబల్ తయారీ కేంద్రంగా మారింది. FY25లో మారుతి సుజుకీ 3.32 లక్షల వాహనాలను ఎగుమతి చేయగా, దేశీయంగా 19.01 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇప్పుడు ఇ-విటారా లాంచ్‌తో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో భారత్ ఒక కీలక మైలురాయిని చేరుకుంది.